Tuesday 20 September 2011

rastam vidipothe avariki anny nillu(రాష్ట్రం విడిపోతే ఎవరికెన్ని నీళ్లు?)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, సీమాంధ్ర లేక తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులలో ఎవరికెంత వాటా వస్తుందో చెప్తారా?




ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినా లేక మూడు రాష్ట్రాలుగా విడిపోయి నా తెలంగాణ వాటాలో తేడారాదు. సీమాంవూధకు వచ్చే వాటాలు, వేటికవే ప్రత్యేకంగానే ఉన్నాయి. కాబట్టి అవి కూడా పంచుకోవడానికి ఇబ్బందేమీ ఉండదు.

ముందు కృష్ణా నదీ జలాల గురించి మాట్లాడుకుందాం. కృష్ణా నదీ జలాలను బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను జరిపింది. మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం నికర జలాలు (75శాతం విశ్వసనీయతన నిర్ధారించబడిన నీరు) 811 టీఎంసీలు (శత కోటి ఘనపు అడుగులు) దక్కాయి.

బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపిన తరువాత ప్రభుత్వం ప్రాజెక్టుల కేటాయింపులలో కొంత సర్దుబాటు చేసింది. ఫలితంగా తెలంగాణకు 295.26 టీఎంసీలు, కోస్తాంధ్రకు 369.74 టీఎంసీలు, రాయలసీమకు 146 టీఎంసీలు లభించాయి. బచావత్ ట్రిబ్యునల్ కాల పరిమితి ముగిసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవతరించింది. కొత్త ట్రిబ్యునల్ 75 శాతం ప్రాతిపదికను మార్చి కొత్తగా 65 శాతం ప్రాతిపదికను అనుసరించింది. ఫలితంగా రాష్ట్రానికి బచావత్ 811 టీఎంసీలకు అదనంగా 45 టీఎంసీలు లభించగలవని ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ 45 టీఎంసీలలో ఆరు టీఎంసీల ను నదిలో వదలవలసిన కనీస నీటి ప్రవాహంగా నిర్ధారించి, మిగిలిన 39 టీఎంసీలలో తొమ్మిది టీఎంసీలను జూరాలకు కేటాయించి,ఇంకా మిగిలిన మూడు టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీ ఓవర్ నిలువ (carry over storage)నిమిత్తం వాడుకోవాలని నిర్ధారించింది. ఒకరకం గా ఈ క్యారీ ఓవర్ స్టోరేజీ ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదన్న మాట. ఈ సంవత్స రం వర్షాలు బాగా పడి, వచ్చే సంవత్సరం నీటి కొరత ఏర్పడే అవకాశముం ఆ పరిస్థితిని అధిగమించడానికి ఈ క్యారీ ఓవర్ స్టోరేజీ ఉపయోగపడుతుంది. ఆ వచ్చే సంవత్సరం కూడా బాగా వర్షాలు పడితే ఈ క్యారీ ఓవర్ స్టోరేజీని ఇతర ప్రాజెక్టులకు ప్రభుత్వం ఉపయోగించుకునే అవకాశముంది.


బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన ఇంకోపనేమంటే కృష్ణానదిలో లభించే మిగులు జలాలను అంచనాగట్టి మూడు రాష్ట్రాలకు పంచింది. ఆంధ్రప్రదేశ్ కు 145 టీఎంసీల మిగులు జలాలను కేటాయించడం జరిగింది. రాయలసీమ కు ఉపయోగపడే ‘తెలుగు గంగ’ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయిం చి, మిగిలిన 120 టీఎంసీలను పైన చెప్పిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల క్యారీ ఓవర్ స్టోరేజీకి జత కలిపింది. అంటే క్యారీ ఓవర్ స్టోరేజీ 30 టీఎంసీల నికర జలాలు, 120 టీఎంసీల మిగులు జలాలు మొత్తం 150 టీఎంసీలవుతుంది. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రాష్ట్రాలు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టులో సవాలు చేయడమే కాక ప్రస్తుతం ట్రిబ్యునల్ ఎదు ట కూడా వాదవూపతివాదనలు కొనసాగుతున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంతిమంగా తమ అవార్డుకు అధికార పత్రం (official gazette)లో ప్రకటించే వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో లేనట్టే. అప్పటి వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డే చెలామణి అవుతుంది.

బచావత్ ట్రిబ్యునల్ అవార్డు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులలో స్వల్పంగా మన ప్రభుత్వం చేసిన సవరణల ఆధారంగా తెలంగాణకు 295.26 టీఎంసీలు లభ్యమవుతున్నట్టు శాసనసభలో రాష్ట్ర ప్రభు త్వం ప్రకటన చేసింది. ఆ ప్రకటన అనుసరించి తెలంగాణలో నికర జలాల ను ఉపయోయోగించుకునే ప్రాజెక్టుల వివరాలివి (టీఎంసీలలో) నాగార్జునసాగర్ ఎడమ గట్టు కాలువ 106.20, డిండి 3.70, పాలేరు 4.00, పాకా ల 2.60, వైరా 3.70, కోయల్ సాగర్ 3.90, రాజోలిబండ స్కీం 15.90, మూసి 9.40, లంకాసాగర్ 1.00, కోటిపల్లివాగు 2.00, ఓక చెట్టువాగు 1.90 చిన్న తరహా సాగునీరు 90.82, జూరాల 17.84, శ్రీశైలం ఆవిరి నష్టం 11.00, జంట నగరాల తాగునీటి సరఫరా 1.30, భీమా 20.00 మొత్తం 295.26 టీఎంసీలు.

శాసనసభలో భారీ నీటి పారుదల శాఖా మంత్రి చేసిన అదే ప్రకటనలో మిగులు జలాలలో తెలంగాణకు 72.32 టీఎంసీలు కూడా కేటాయించినట్టు చెప్పారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ 26.22, నెట్టంపాడు 20.00, కల్వకుర్తి 25.00, జంట నగరాల తాగునీటి సరఫరాకు 1.10 మొత్తం 72.32 టీఎంసీలు. ఈ రకంగా మొత్తం తెలంగాణకు 367.58 టీఎంసీల నీరు అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మిగు లు జలాల విషయం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఈ మిగులు జలాల కేటాయింపులకు ఎలాంటి చట్టబద్ధత, సాధికారత ఉండ దు. కనుక ఈలోగా తెలంగాణ ఏర్పడితే కృష్ణానది నికర జలాలలో తెలంగాణకు 295.26 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని, అంతకు మించి అవకాశం లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. నికర జలాల విషయం తరువాత తేలుతుంది.

ఇక గోదావరి విషయానికి వస్తే తెలంగాణ, కోస్తాంధ్ర మధ్యే కేటాయింపులుంటాయి. ఈ నదీ జలాల పైన కూడా బచావత్ ట్రిబ్యునలే నివేదిక సమర్పించింది. వివిధ రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఒప్పందాల ఆధారంగా ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు ప్రకారం మన రాష్ట్రానికి గోదావరి నికర జలాలు 1480 టీఎంసీలుగా నిర్ధారణ జరిగింది. మన ప్రభుత్వం లోగడ అధికారికంగా ప్రకటించిన ప్రాజెక్టుల వివరాల ప్రకారం భారీ ప్రాజెక్టులకు 1270.28 టీఎంసీలు, మధ్య తరహా ప్రాజెక్టులకు 64.25 టీఎంసీ లు, చిన్న తరహా ప్రాజెక్టులకు 139.77 టీఎంసీలు, పారిక్షిశామిక, తాగునీటి అవసరాలకు 5.70 టీఎంసీలు మొత్తం 1480 టీఎంసీల వినియోగం ఉంటుంది. భారీ ప్రాజెక్టులలో తెలంగాణకు 705.68 టీఎంసీలు, ఆంధ్రకు 564.60 టీఎంసీలని లెక్కలు కట్టింది.

ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్రాజెక్టు వివరాలు (వినియోగం టీఎంసీలలో)
తెలంగాణలో నిర్మించబడినవి

నిజాంసాగర్ - 58.00, మంజీర తాగునీటి పథకం -2.97, సింగూరు- 11.00, కడం-13.42, శ్రీరాంసాగర్ ప్రథమ దశ-145.35, కిన్నెరసాని-8.14- మొత్తం 238.88 టీఎంసీలు
తెలంగాణలో నిర్మాణంలో ఉన్నవి
లెండి-2.80, గుత్ప-3.04 అలీసాగర్-2.96, ఎల్లంపల్లి-63.00, దేవాదుల 50.00, శ్రీరాంసాగర్ వరద కాలువ-20.00, శ్రీరాంసాగర్ ద్వితీయదశ-40.00 మొత్తం 171.80 టీఎంసీలు.
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు
దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్-20.00, ఇందిరాసాగర్ రుద్రమకోట-20.00- మొత్తం 40.00 టీఎంసీలు.

తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులు
ప్రాణహిత చేవెళ్ల-160.00, ఇచ్చంపల్లి 85.00 మొత్తం 245.00 టీఎంసీలు
ఈవిధమైన నాలుగు కేటగిరిలలోని ప్రాజెక్టుల మొత్తం వినియోగం 705.68 టీఎంసీలు. ఆంధ్రకు సంబంధించిన ప్రాజెక్టులు రెండే రెండు. నిర్మించబడిన ధవళేశ్వరం బ్యారేజీ-263.60 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న పోలవరం-301.00 టీఎంసీలు-మొత్తం వినియోగంలో 564.60 టీఎంసీలు.
అయితే ప్రభుత్వం లోగడ ప్రకటించిన ప్రాజెక్టులు, వాటి వినియోగంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు నిజాంసాగర్ వినియోగం 58 టీఎంసీలు లేదు. ప్రస్తుతం 30 టీఎంసీలకు మించిలేదు. ఇచ్చంపల్లి నిర్మాణంలో లేదు. కంతనపల్లి ఇచ్చంపల్లికి బదులుగా వచ్చింది. అంతిమంగా కంతనపల్లికి 100 టీఎంసీల వినియోగం అని భావిస్తున్నారు.

గుత్ప, అలీ సాగర్‌ల నిర్మాణం పూర్తయింది. దేవాదుల వినియోగం 50 కి బదులుగా 38.18 టీఎంసీలుగా మాత్రమే ఉంది. ఏదేమైనా ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలంగాణలో భారీ ప్రాజెక్టుల వినియోగం 705.68 టీఎంసీలని భావించవచ్చు. ఇక మధ్యతరహా ప్రాజెక్టుల విషయానికి వస్తే.. రాష్ట్రం మొత్తానికి 64.25 టీఎంసీల వినియోగంగా అంచనా వేశారు. అందులో సుమారు 60 టీఎంసీల వినియోగం తెలంగాణలోనే ఉంటుంది. ఇక చిన్నతరహా ప్రాజెక్టుల విషయానికి వస్తే మొత్తం వినియోగం 139.77 టీఎంసీలలో అత్యధిక భాగం తెలంగాణలోనే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. గోదావరి జలాల వినియోగంలో సుమా రు 580 టీఎంసీలలోపు ఆంధ్రకు, 900 టీఎంసీల కన్నా కాస్త ఎక్కువగా తెలంగాణకు దక్కుతుందని ఆశించవచ్చు. పోలవరానికి కేటాయించిన 301 టీఎంసీలలో పోలవరానికి ప్రత్యామ్నాయంగా చేపట్టిన తాటిపూడి, పుష్క రం, చాగల్నాడు వినియోగాలు కూడా 301 టీఎంసీలలో భాగమై ఉంటా యి.

ప్రభుత్వం 165 టీఎంసీల వినియోగంతో ప్రకటించిన ‘దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్’ కేవలం మిగులు (లేక వరద) జలాలపై ఆధారపడి ఉన్నది అన్న విషయం ప్రభుత్వం పదేపదే చెప్తున్నా అంత నమ్మదగినదిగా అనిపించడం లేదు. కారణం పోతిడ్డిపాడు విషయంలో కూడా ప్రభుత్వం వరద జలాలని చెప్పి నికర జలాలను తరలించడమే. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణానదిలో లభ్యమయ్యే నికరజలాలు 811 టీఎంసీలలో తెలంగాణకు 295.26 టీఎంసీలు (మిగులు జలాలు 72.32 టీఎంసీలని ప్రకటించినా నిర్ధారణ కాలేదు). ఇక గోదావరి జలాలలోని నికర జలాల మొత్తం 1480 టీఎంసీలలో 900 టీఎంసీలు (సుమారు)గా ఉంటాయని భావించవచ్చు. సమస్యల్లా గోదావరిపైన ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు చాలా మటుకు నిర్మాణం కావలసి ఉన్నవి. అవి ఎప్పు డు పూర్తవుతాయో తెలియదు. ఈ లోగా ప్రభుత్వం దుర్మార్గంగా చేపట్టిన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ పూర్తయి సమస్యలు సృష్టించవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే లభ్యమయ్యే జలాల సంపూర్ణ వినియోగం గురించి శరవేగంగా ప్రయత్నాలు మొదలుపెట్టడానికి రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు వ్యూహాలు రచిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు అటు కాగితాలపైనో, భూమిపైనో అసంపూర్తిగా ప్రజలను వెక్కిరిస్తూ ఉంటాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు ఉంది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి.

ఇదీ సంగతి
నదీజలాలు-రకాలు

నదీ జలాలను నికరజలాలు (dependable waters) మిగులు జలాలు (surpless waters), వరద జలాలు (flood waters)గా వర్గీకరణ చేయవచ్చు. నమ్మకంగా వస్తాయని అంచనావేసే నీళ్లు నికర జలాలు. ప్రస్తుతం సాగునీటి వ్యవస్థ 75 శాతం విశ్వసనీయత ఆధారం గా రూపుదిద్దుకుంటున్నది. ప్రాజెక్టులు 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన కడ్తున్నారంటే నూరు సంవత్సరాల కాలంలో 75 సంవత్సరాల పాటు తప్పక వస్తుందన్న నేటి పరిమాణాన్ని అంచనా వేసి నికర జలాలని చెప్పుకుంటున్న ఆ నీటి ఆధారంగా అన్నమాట. మిగిలిన 25 సంవత్సరాలు నికర జలాల పరిణామం కన్న తక్కువ నీరు వస్తుందని భావించవచ్చు. ఈ 75 సంవత్సరాలలో తప్పక వస్తుందన్న నీటి పరిమాణం కంటే కొన్ని ఏళ్లలో ఎక్కువ నీరు వస్తే ఆ నీటిని ‘మిగులు జలాలు’గా వ్యవహరిస్తాం. మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులను ప్రణాళిక సంఘం సాధారణ పరిస్థితుల్లో ఆమోదించదు. మిగులు జలాల విశ్వసనీయత తక్కువ కావడమే అందుకు కారణం. అలా రూపొందించిన ప్రాజెక్టులు ఎక్కువ కాలం నిండ కుండా ఖాళీగా ఉండి ప్రజాధనం దుర్వినియోగం కావడానికి హేతువు అవుతాయని కేంద్రం అభివూపాయం. నదుల్లో ఉధృతంగా వరదలు వచ్చినప్పుడు ప్రవహించే నీటిని ‘వరద జలాలు’గా చెప్పుకుంటాం. వీటని ఒడిసిపట్టుకోవడం కాని వీటి ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోవడం కాని సాధ్యమయ్యే పనికాదు. అందుకు కేంద్రం ఒప్పుకోదు. అయితే వ్యవహారం మామూలుగా వచ్చే ప్రవాహా న్ని కూడా వరద జలాలని, మిగులు జలాలను కూడా వరద జలాలని అశాస్త్రీయంగా పేర్కొనడం గమనిస్తున్నాం.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

No comments:

Post a Comment

In this blog it consists of all categories of Telangana information such as Telangana images,Telangana information,Telangana maps,Telangana videos,Telangana movies,Telangana news,Telangana history,Telangana Samskruthi,Festivals of Telangana,Bathukamma : Telangana Festival,bonalu........etc

Disclamier

The entire content available in this blog is my personal views only. There is no connection with any one for the content I published in this blog. I Just want to share my views about telangana. Because I am belongs to Telangana. Jai Telangana.... Jai Jai Telangana. We want the State of Telangana........... We do any thing for Telangana. If you want to contact me or you think to post some thing regards telangana which I miss please comment on posts